దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకుంది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. మొత్తం 234 నియోజకవర్గాల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ఎవరిది పైచేయి అనే అంశంపై తాజాగా వెలువడిన జాతీయ స్థాయి సర్వేలు సంచలన విషయాలను వెల్లడించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోబోతోందని ‘లోక్ పోల్’ (Lok Poll), ‘పోల్ ట్రాకర్’ (Poll Tracker) సంస్థలు తమ ముందస్తు సర్వేల్లో స్పష్టం చేశాయి.
డీఎంకే కూటమికి పట్టం.. భారీ మెజారిటీ ఖాయం!
లోక్ పోల్ సంస్థ నిర్వహించిన మెగా గ్రౌండ్ సర్వే ప్రకారం, అధికార డీఎంకే కూటమి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించబోతోంది. మొత్తం 234 స్థానాలకుగానూ ఈ కూటమి 181 నుంచి 189 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ఓట్ల శాతంలోనూ 40.1 శాతంతో డీఎంకే అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1 మధ్య సుమారు 1,17,000 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి ఈ ఫలితాలను వెల్లడించారు.
మరోవైపు పోల్ ట్రాకర్ సర్వే కూడా ఇవే ఫలితాలను ధృవీకరించింది. డీఎంకే కూటమికి 172 నుంచి 178 స్థానాలు దక్కవచ్చని, ఓట్ల శాతం 42.7 శాతంగా ఉండొచ్చని ఈ సంస్థ వెల్లడించింది. గత ఐదేళ్ల పాలన, సంక్షేమ పథకాలు స్టాలిన్ ప్రభుత్వానికి శ్రీరామరక్షగా నిలిచాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్టాలిన్ ‘వ్యూహం’.. మహిళా ఓటర్లే కీలకం!
డీఎంకే కూటమి ఇంతటి భారీ ఆధిక్యత సాధించడానికి ప్రధాన కారణం ఆ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలేనని లోక్ పోల్ సర్వే విశ్లేషించింది. ముఖ్యంగా ‘కలైంజర్ మగలిర్ ఉరిమై తొగై’ (మహిళా హక్కుల నిధి), ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార పథకాలు గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లోని మహిళా ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ పథకాల ద్వారా మహిళలు నేరుగా లబ్ధి పొందుతుండటం డీఎంకేకు క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకును సృష్టించింది.
ప్రతిపక్షాల్లో చీలిక.. డీఎంకేకు వరంగా మారిన ‘విజయ్’ ఫ్యాక్టర్!
ఈ ఎన్నికల్లో డీఎంకేకు అతిపెద్ద అడ్వాంటేజ్ ప్రతిపక్ష ఓట్లు చీలిపోవడమేనని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే (NDA) ఒకవైపు, సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) మరోవైపు బరిలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకీకృతం కావడం లేదు.
రాజకీయ రంగప్రవేశం చేసిన నటుడు విజయ్ తన పార్టీ ‘టీవీకే’తో గణనీయమైన ప్రభావం చూపుతున్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. లోక్ పోల్ అంచనా ప్రకారం విజయ్ పార్టీ 23.9 శాతం ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉంది, అయితే ఇది కేవలం 8 నుంచి 10 స్థానాలకే పరిమితం కావొచ్చు. పోల్ ట్రాకర్ మాత్రం టీవీకేకు 6 నుంచి 12 స్థానాలు దక్కవచ్చని, ఓట్ల శాతం 19.2 ఉండొచ్చని పేర్కొంది. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వేస్తున్న వారు, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది. అయితే ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఈ ఓట్లు సీట్లుగా మారే అవకాశం తక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అన్నాడీఎంకే దీనావస్థ.. ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ?
ఎడప్పాడి పళనిస్వామి (EPS) నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమి ఈసారి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కీలక నేతల నిష్క్రమణ, కేడర్‌లో నిరుత్సాహం అన్నాడీఎంకేను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా డెల్టా, దక్షిణ జిల్లాల్లో అన్నాడీఎంకే పట్టు కోల్పోతున్నట్లు లోక్ పోల్ సర్వే హెచ్చరించింది.
ఎన్డీయే కూటమి (అన్నాడీఎంకే-బీజేపీ) 29 శాతం ఓట్లతో కేవలం 38 నుంచి 42 స్థానాలకే పరిమితం కావొచ్చని లోక్ పోల్ అంచనా వేయగా, పోల్ ట్రాకర్ 46 నుంచి 52 స్థానాలు రావొచ్చని పేర్కొంది. అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు వల్ల మైనారిటీ ఓట్లు పూర్తిగా డీఎంకే వైపు ఏకీకృతమవ్వడం ప్రతిపక్ష కూటమికి పెద్ద మైనస్‌గా మారింది. ముదలియార్, నాయుడు, ముస్లిం వర్గాలు స్పష్టంగా డీఎంకే కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
సీఎం రేసులో స్టాలిన్ టాప్!
ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల మొదటి ఎంపిక ఎవరు అనే ప్రశ్నకు అత్యధికులు ఎం.కె. స్టాలిన్ వైపే మొగ్గు చూపారు. ఆయన తర్వాత స్థానాల్లో నటుడు విజయ్,అన్నాడీఎంకే నేత పళనిస్వామి నిలిచారు. పళనిస్వామి ,విజయ్ కంటే స్టాలిన్ మరింత అనుభవం ఉన్న, సుపరిచితమైన నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు పొందడం విశేషం.
ఇతర పార్టీల పరిస్థితి
సీమాన్ నేతృత్వంలోని ఎన్‌టీకే (NTK) ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని సర్వేలు చెబుతున్నాయి. సుమారు 4.9 నుంచి 5.1 శాతం ఓట్లు సాధించినా, ఆ పార్టీకి ఒకటి లేదా రెండు స్థానాలు దక్కడమే కష్టమని తెలుస్తోంది. ఇక ఇతరుల ప్రభావం 2.1 శాతానికే పరిమితం కానుంది.
అభ్యర్థుల ఖరారులో వేగం
ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచాయి. బీజేపీ ఇప్పటికే 27 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది, ఇందులో కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ పేరు కూడా ఉంది. కాంగ్రెస్ కూడా 27 మంది అభ్యర్థులను ప్రకటించింది, రాష్ట్ర అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై బరిలో నిలిచారు.
మొత్తానికి ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల పోరులో డీఎంకే విజయం దాదాపు ఖాయమని సర్వేలు చెబుతున్నా, విజయ్ పార్టీ చీల్చే ఓట్లు ఎవరి కొంప ముంచుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






