Water Intake:ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని వైద్యులు చెబుతుంటారు. కానీ, కొందరు అతి ఉత్సాహంతో అంతకంటే ఎక్కువ నీటిని తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా గంటకో లీటర్ నీరు తాగితే శరీరం శుద్ధి అవుతుందని, చర్మం మెరుస్తుందని నమ్మే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే, ఒక వ్యక్తి ప్రతి గంటకు ఒక లీటర్ చొప్పున నీటిని తాగుతూ ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అది ప్రాణాపాయానికి ఎలా దారితీస్తుంది? తాజా పరిశోధనలు, నిపుణులు వెల్లడిస్తున్న షాకింగ్ నిజాలను ఓసారి పరిశీలిద్దాం.**
మొదటి రోజు: హైడ్రేషన్ పెరగడం.. తరచుగా మూత్ర విసర్జన
ఒక వ్యక్తి ప్రతి గంటకు ఒక లీటర్ నీరు తాగడం ప్రారంభించిన మొదటి రోజు, శరీరంలో హైడ్రేషన్ స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు సంభవిస్తాయి. ప్రతి గంటకూ లీటర్ నీరు తాగడం వల్ల పొట్ట ఎప్పుడూ నిండుగా ఉన్నట్లు (Bloated) అనిపిస్తుంది. దీనికి తోడు, శరీరంలోకి చేరిన అధిక నీటిని బయటకు పంపడానికి మూత్రపిండాలు అత్యధికంగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా, ఆ వ్యక్తి తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.
కొన్ని రోజుల తర్వాత: వ్యర్థాలు వెలుపలికి.. మెరిసే చర్మం
ఈ అలవాటును కొన్ని రోజుల పాటు కొనసాగిస్తే, ప్రారంభంలో కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తాయి. శరీరంలోని టాక్సిన్స్ (వ్యర్థ పదార్థాలు) మూత్రం ద్వారా వేగంగా బయటకు వెళ్లడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. చర్మం మునుపటి కంటే ఫ్రెష్‌గా, కాంతివంతంగా శుభ్రంగా మారినట్లు అనిపిస్తుంది. అయితే, ఈ తాత్కాలిక మెరుగుదల వెనుక ఒక పెద్ద విపత్తు పొంచి ఉంటుందని చాలా మంది గమనించరు.
ఏడో రోజు: అసలైన ముప్పు మొదలు.. సోడియం స్థాయి పతనం
ఈ నీటి వినియోగం వారం రోజులు దాటిన తర్వాత, శరీరంలోని అంతర్గత వ్యవస్థలు దెబ్బతినడం మొదలవుతుంది. రక్తం విపరీతంగా పలుచబడటం వల్ల అందులోని సోడియం (Sodium) స్థాయిలు ప్రమాదకరంగా పడిపోతాయి. వైద్య పరిభాషలో దీనిని ‘హైపోనాట్రేమియా’ అని పిలుస్తారు. శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినడం వల్ల ఆ వ్యక్తికి విపరీతమైన తలనొప్పి రావడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా, నీరసం, కళ్లు తిరగడం (Dizziness) వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వాటర్ ఇంటాక్సికేషన్: మెదడుపై ఒత్తిడి.. మరణం సంభవించే అవకాశం!
గంటకు ఒక లీటర్ చొప్పున నీటిని నిరంతరాయంగా తీసుకుంటే, అది ‘వాటర్ ఇంటాక్సికేషన్’ (Water Intoxication) స్థితికి దారి తీస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. రక్తంలో సోడియం తక్కువ కావడం వల్ల శరీరంలోని కణాల్లోకి నీరు చేరుతుంది, ముఖ్యంగా మెదడు కణాల వాపునకు ఇది కారణమవుతుంది. ఫలితంగా మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల సదరు వ్యక్తి స్పృహ కోల్పోవడం (Unconsciousness) లేదా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అందకపోతే ఇది మరణానికి కూడా దారి తీయవచ్చు.
గమనిక: అవసరానికి మించితే ఏదైనా విషమే!
మంచి నీరు ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ, అవసరానికి మించి తీసుకోవడం వల్ల అది అమృతం నుంచి విషంగా మారుతుంది. శరీరానికి ఎంత నీరు అవసరమో అంత మాత్రమే తీసుకోవాలని, అతిగా నీరు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఈ కథనం సారాంశం.





