Shane Warne: వన్నె తగ్గని వార్న్ మ్యాజిక్! రాజస్థాన్ రాయల్స్ విక్రయంతో కుటుంబానికి రూ. 450 కోట్ల పంట!

Shane Warne

shane warne: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మైదానంలో బంతితో చేసే మ్యాజిక్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ, వ్యాపార రంగంలోనూ ఆయనకు ఎంతటి దూరదృష్టి ఉందో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఒక సంచలన వార్త నిరూపిస్తోంది. ఐపీఎల్ తొలి సీజన్ ప్రారంభానికి ముందు ఆయన వేసిన ఒక చిన్న సంతకం, నేడు ఆయన కుటుంబానికి ఏకంగా రూ. 450 కోట్ల నుంచి 460 కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టబోతోంది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారీ మొత్తానికి విక్రయం కావడంతో, వార్న్ కుదుర్చుకున్న పాత ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆ పాత ఒప్పందం ఏమిటి? 18 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పుడు, రాజస్థాన్ రాయల్స్ జట్టు షేన్ వార్న్‌ను కెప్టెన్‌గా, కోచ్‌గా నియమించుకుంది. అప్పట్లో ఫ్రాంచైజీకి పెద్దగా ఆశలు లేవు, కానీ వార్న్ తన నాయకత్వంతో ఆ జట్టును విజేతగా నిలిపారు. అయితే, ఆ సమయంలో వార్న్ తన ఒప్పందంలో ఒక ప్రత్యేకమైన క్లాజును (Clause) చేర్చారు. దాని ప్రకారం, ఆయన ఆడిన ప్రతి సీజన్‌కు గాను ఫ్రాంచైజీలో 0.75 శాతం యాజమాన్య వాటా (Ownership Stake) పొందుతారు. ఇలా వరుసగా నాలుగు సీజన్ల పాటు (2008-2011) ఆయన రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడటంతో, ఆ జట్టులో ఆయనకు మొత్తం 3 శాతం వాటా లభించింది.

రూ. 15,290 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ విక్రయం

తాజాగా అమెరికాకు చెందిన కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ విక్రయ విలువ అక్షరాలా 1.63 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15,290 కోట్లు) అని సమాచారం. 2008లో మనోజ్ బదాలే నేతృత్వంలోని ఎమర్జింగ్ మీడియా ఈ జట్టును కేవలం 67 మిలియన్ డాలర్లకు మాత్రమే కొనుగోలు చేసింది. అంటే గడిచిన 18 ఏళ్లలో ఈ ఫ్రాంచైజీ విలువ ఊహించని రీతిలో పెరిగింది. ఈ మొత్తం అమ్మకం విలువలో షేన్ వార్న్‌కున్న 3 శాతం వాటా విలువ ఇప్పుడు రూ. 450 కోట్లు దాటుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వార్న్ లేకున్నా.. కుటుంబానికి ధీమా

దురదృష్టవశాత్తు షేన్ వార్న్ 2022లో గుండెపోటుతో మరణించారు. తన దూరదృష్టితో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారా వచ్చే భారీ మొత్తాన్ని చూసేందుకు ఆయన నేడు లేకపోయినా, ఆయన చేసిన ఆ ప్లానింగ్ ఇప్పుడు ఆయన కుటుంబానికి ఆర్థికంగా కొండంత అండగా నిలుస్తోంది. వార్న్ తన హయాంలో కేవలం కెప్టెన్‌గా మాత్రమే కాకుండా, జట్టు క్రికెట్ కార్యకలాపాలన్నింటినీ తానే దగ్గరుండి చూసుకునేవారని గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. “వారే నన్ను కెప్టెన్‌గా, కోచ్‌గా ఉండమని కోరారు.. ఆ జట్టును నా ఇష్టానుసారం నడిపించే స్వేచ్ఛనిచ్చారు” అని వార్న్ అప్పట్లో పేర్కొన్నారు.

బీసీసీఐ ఆమోదం తర్వాతే తుది ప్రక్రియ

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత షేన్ వార్న్ కుటుంబం తమ వాటాను విక్రయించి నగదును పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ యాజమాన్య మార్పిడి, వాటాల విక్రయ ఒప్పందం ఖరారు కావాలంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆమోదం తప్పనిసరి. 2026 ఐపీఎల్ సీజన్ మార్చి 28న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌ను మార్చి 30న గౌహతిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది.

ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక అద్భుతం

ఒక క్రీడాకారుడు కేవలం జీతం రూపంలోనే కాకుండా, ఫ్రాంచైజీ వాటాల రూపంలో ఇంతటి భారీ లాభాన్ని పొందడం ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన విషయం. షేన్ వార్న్ తన వ్యూహాలతో మైదానంలోనే కాదు, మైదానం బయట కూడా ‘విన్నర్’ అని ఈ డీల్ నిరూపిస్తోంది. ఐపీఎల్ విలువ ఏటా పెరుగుతున్న తరుణంలో, ప్రారంభ దశలోనే ఈ లీగ్ భవిష్యత్తును అంచనా వేసి వాటాలను కోరుకోవడం వార్న్ తెలివితేటలకు నిదర్శనం.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం