మార్కెట్‌లో నకిలీ గుడ్ల ప్రచారం – నిజమెంత? అసలైన కోడిగుడ్లను ఇంట్లోనే గుర్తించే 2 నిమిషాల సులభ పరీక్షలు!

fake vs real eggs

సంపూర్ణ ఆహారంగా ప్రాచుర్యం పొందిన కోడిగుడ్ల వినియోగంపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ‘నకిలీ లేదా ప్లాస్టిక్ గుడ్లు’ మార్కెట్‌లోకి వచ్చేశాయంటూ సాగుతున్న ప్రచారాలు సామాన్య వినియోగదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, శాస్త్రీయంగా, ఆర్థిక రిత్యా కృత్రిమంగా కోడిగుడ్లను తయారు చేయడం అసాధ్యమని, ఇవన్నీ కేవలం ఇంటర్నెట్ ఆధారిత అపోహలు మాత్రమేనని ఆహార భద్రతా నిపుణులు,పోషకాహార శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కోడిగుడ్డు తయారీకి అయ్యే సాంకేతిక వ్యయం కంటే సహజసిద్ధమైన కోడిగుడ్డు లభ్యత చౌకగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

అదే సమయంలో, ప్లాస్టిక్ గుడ్ల పుకార్లను పక్కనబెడితే.. మార్కెట్లో కొనుగోలు చేసే గుడ్ల తాజాదనం, వాటి నాణ్యత, నిల్వ చేసిన వాతావరణం వినియోగదారుల ఆరోగ్యానికి అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాడైపోయిన లేదా సరిగ్గా నిల్వ చేయని గుడ్లను తింటే బ్యాక్టీరియా సంక్రమణ ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అసలైన, తాజా కోడిగుడ్లను ఇంట్లోనే కేవలం 2 నిమిషాల్లో ఎలా గుర్తించవచ్చో ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అవసరం.

పోషకాహార విలువలు & సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల కలిగే ప్రమాదాలు

సహజసిద్ధమైన కోడిగుడ్లలో శరీర ఎదుగుదలకు, కండరాల నిర్మాణానికి అవసరమైన అత్యుత్తమ నాణ్యత కలిగిన ప్రొటీన్లు, విటమిన్ బి12, డి, కొలైన్,వివిధ రకాల ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. రోజువారీ పోషకాహారంలో గుడ్డును చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అయితే, గుడ్ల విక్రయదారులు లేదా గృహాల్లో వాటిని తగిన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయకపోతే ‘సాల్మొనెల్లా’ (Salmonella) వంటి హానికర బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. పాతబడిన లేదా కుళ్ళిపోయిన గుడ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, కడుపునొప్పి, వాంతులు వంటి ఆహార కాలుష్య (Food Poisoning) లక్షణాలు కనిపిస్తాయి. అందుకే గుడ్డు తాజాదనాన్ని ముందే పరీక్షించుకోవడం మంచిది.

ఇంట్లోనే 2 నిమిషాల్లో నిర్వహించే సులభమైన నాణ్యతా పరీక్షలు

కోడిగుడ్డు నాణ్యత, తాజాదనాన్ని అంచనా వేయడానికి నిపుణులు ప్రతిపాదించిన 4 ప్రధాన గృహ పరీక్షలు ఇవే.

1. పెంకు ఉపరితల పరిశీలన : తాజా అసలైన కోడిగుడ్డు బయటి పెంకు కొద్దిగా గరుకుగా, మ్యాట్ ఫినిషింగ్‌తో ఉంటుంది. ఒకవేళ పెంకు చాలా నునుపుగా, నిగనిగలాడుతూ లేదా అసాధారణమైన మెరుపుతో ఉంటే అది చాలా రోజులుగా నిల్వ ఉంచిన పాత గుడ్డు లేదా తప్పుడు వాతావరణంలో ఉంచినదని అర్థం చేసుకోవాలి.

2.శబ్ద పరీక్ష: కోడిగుడ్డును చెవి దగ్గర ఉంచుకుని తేలికగా ఊపినప్పుడు లోపల నుంచి ఎలాంటి శబ్దం రాకూడదు. తాజా గుడ్డులో పచ్చసొన, తెల్లసొన గట్టిగా అనుసంధానమై ఉంటాయి. ఒకవేళ ఊపినప్పుడు లోపల నీళ్లలా కదులుతున్న శబ్దం వస్తే, ఆ గుడ్డు పాతబడి నీటి శాతం కోల్పోయిందని గ్రహించాలి.

3. నీటి పరీక్ష : ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో గుడ్డును వేయాలి. గుడ్డు పాత్ర అడుగున అడ్డంగా స్థిరంగా ఉంటే అది అత్యంత తాజాదనం కలిగినది. ఒకవేళ గుడ్డు నీటిపై తేలియాడితే అది పాతబడి లోపల గాలి గది పెద్దదైందని, తినడానికి యోగ్యమైనది కాదని గుర్తించాలి.

4. దుర్వాసన పరిశీలన: పగలేసినప్పుడు లేదా పెంకుపై నుండి ఎటువంటి అసాధారణమైన ఘాటైన దుర్వాసన రాకూడదు. పగడగొట్టినప్పుడు తెల్లసొన చిక్కగా, పచ్చసొన గుండ్రంగా ఎత్తుగా నిలబడితే అది నాణ్యమైన తాజా గుడ్డుకు సంకేతం.

సోషల్ మీడియాలో వ్యాపించే ప్లాస్టిక్ గుడ్ల పుకార్లను నమ్మి భయాందోళనలకు గురికాకుండా, ఈ సులభమైన చిట్కాలతో గుడ్ల తాజాదనాన్ని నిర్ధారించుకుని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం