మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన; ‘నన్ను మీ ఆంధ్ర బిడ్డగా భావించండి’ అన్న అనంత్ అంబానీ; రాయలసీమను ‘ఫ్రూట్ బౌల్’గా మారుస్తామన్న చంద్రబాబు!

global horticulture hub madanapalle

అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ‘రాయలసీమ ఉద్యాన హబ్”ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ప్రాజెక్టులకు అక్టోబర్ 2న అధికారికంగా శంకుస్థాపన జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో సంయుక్తంగా పాల్గొన్నారు.

రాయలసీమ ఉద్యాన హబ్, ఐఎస్ఏ ఏర్పాటులో రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యం కావడం పట్ల హర్షం వ్యక్తమైంది. కరవు నేలగా భావించే రాయలసీమను పండ్ల తోటల సాగుతో ‘ఫ్రూట్ బౌల్’గా తీర్చిదిద్ది, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని మేకర్స్ ప్రకటించారు.

“నన్ను మీ ఆంధ్ర బిడ్డగా భావించండి” – అనంత్ అంబానీ విజ్ఞప్తి

ఈ శంకుస్థాపన సభలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రసంగిస్తూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ఈ చరిత్రాత్మక ప్రాజెక్టులో రిలయన్స్ సంస్థకు భాగస్వామ్యం కల్పించి తమపై అపారమైన నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో మాకు ప్రత్యేక బంధం ఉంది. నన్ను మీ ఆంధ్ర బిడ్డగా భావించి, రాష్ట్రానికి అందించాల్సిన రంగాలు, సహకారంపై నేరుగా మార్గనిర్దేశం చేయండి” అని అనంత్ అంబానీ సీఎం చంద్రబాబును కోరారు.

భారతీయ సాంప్రదాయం, పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ, కార్యక్రమం ముగిసిన అనంతరం అనంత్ అంబానీ వేదికపై ఉన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్,సీఎం చంద్రబాబు నాయుడుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా వైరల్ అయ్యాయి.

అనంత్ అంబానీ ‘ఆంధ్ర ముద్దుబిడ్డ’ సీఎం చంద్రబాబు ప్రశంసలు

అనంత్ అంబానీ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ ఆయనను ‘ఆంధ్ర ముద్దుబిడ్డ’గా అభివర్ణించారు. అనంత్ అంబానీ కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదని, గొప్ప పర్యావరణ పరిరక్షకుడు అని కొనియాడారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3,500 ఎకరాల విస్తీర్ణంలో జంతువుల పునరావాస కేంద్రం ‘వంతారా’ను ఏర్పాటు చేయడాన్ని సీఎం గుర్తుచేశారు. తిరుమల శ్రీవారిపై భక్తితో టీటీడీకి ఉచితంగా ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇచ్చారని, 2035 నాటికి రిలయన్స్ సంస్థను నెట్ జీరో కార్బన్ సంస్థగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ను కూడా వంతారా తరహాలోనే అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అనంత్ అంబానీని కోరారు.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాయలసీమలో 6 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలను విస్తరిస్తామని, ప్రకృతి సేద్యంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. సాగునీరు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే ఏ రకం పంటనైనా పండించే సత్తా సీమ రైతులకు ఉందని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని, హంద్రీనీవా నీళ్లు రాకపోతే మదనపల్లె ప్రాంతం వలసల బాట పట్టేదని గుర్తుచేశారు. రూ. 35,000 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాబోయే మూడేళ్లలో జాతికి అంకితం చేస్తామని, హంద్రీనీవా ఫేజ్-2, వెలిగొండ ఫేజ్-2, మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులను వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.

రాయలసీమను ‘రతనాల సీమ’గా మారుస్తాం: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాయలసీమను మళ్లీ ‘రతనాల సీమ’గా మారుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు పంట పెట్టుబడి సమయానికి అందుతోందని తెలిపారు.

రైతులకు రక్షణగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ చర్యలను ఆమె వివరించారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తూ, ఒక్కో బ్యాగ్‌కు రూ.300 కంటే ఎక్కువ వసూలు చేయకూడదని గట్టి ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. గ్రామాల్లో గోబర్ధన్ పథకం ద్వారా బయోగ్యాస్ ఉత్పాదన, అలాగే సూర్యఘర్ యోజన, పీఎం కుసుమ్ యోజన ద్వారా సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ పంపిణీకి సౌకర్యాలు కల్పించామని వివరించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కిసాన్ ఇన్సూరెన్స్ స్కీమ్ బాసటగా నిలుస్తోందన్నారు.

రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం- మంత్రి నారా లోకేష్

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, మదనపల్లెలో ఏర్పాటు చేస్తున్న ఉద్యాన హబ్ ద్వారా ప్రపంచ ప్రసిద్ధి చెందిన అనేక పండ్ల రకాలు ఇకపై రాయలసీమ నేలలో పండే సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీనివల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.

చంద్రబాబు ముందుచూపుతో ప్రాజెక్టులు పూర్తి చేసి కరవు సీమకు నీటిని తేవడాన్ని ప్రస్తావిస్తూ, ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ చంద్రబాబును ‘వాటర్ మ్యాన్’ అని అభివర్ణిస్తే, ప్రతిపక్ష గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతోందని విమర్శించారు.

స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అవార్డుల ప్రదానం

అంతకుముందు, విజయవాడలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ ప్రధానోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. శుభ్రమైన గ్రామాలు, పట్టణాలు, సంస్థలకు ప్రతిష్టాత్మక అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నెలలో కనీసం ఒకరోజు ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, 5 కోట్ల మంది ప్రజల సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. చెత్తను సమస్యగా చూడకుండా, దాని ద్వారా సంపద సృష్టించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగస్వాములైతేనే స్వర్ణాంధ్ర ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.

మదనపల్లెలో ప్రారంభమైన ఈ ఉద్యాన విప్లవం, సాగునీటి ప్రాజెక్టుల విస్తరణ రాబోయే రోజుల్లో రాయలసీమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం