భాగ్యనగరంలో నిత్యం ప్రయాణించే లక్షల మంది ప్రయాణికులకు మెరుగైన, వేగవంతమైన రవాణా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గురువారం ప్రజాభవన్ వేదికగా కీలక నిర్ణయాలు వెల్లడించింది. నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో ఒకే పాస్‌తో సులభంగా ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన ‘ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్’ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారికంగా ఆవిష్కరించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్, అజారుద్దీన్‌లతో కలసి జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో సహా 15 మంది మంత్రులకు డిప్యూటీ సీఎం నగదు చెల్లించి మరీ వన్ డే కామన్ పాస్‌లను కొనుగోలు చేశారు. ప్రయాణికుల కోసం ఈ పాస్‌లు ఒక రోజు (వన్ డే), నెలవారీ వ్యవధుల్లో అపరిమిత ప్రయాణ సౌకర్యంతో అందుబాటులోకి వచ్చాయి.
మరోవైపు, ఇంధన ధరలు, వాహన నిర్వహణ, ఇన్సూరెన్స్ ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆటో ఛార్జీలను ప్రభుత్వం సవరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఫిబ్రవరి 14న జారీ చేసిన G.O.Ms.No.20 తర్వాత, దాదాపు 12 ఏళ్ల విరామం అనంతరం ప్రభుత్వం కొత్త టారిఫ్ ఉత్తర్వులను విడుదల చేసింది. ఆటో కార్మికుల సంక్షేమం,ప్రయాణికుల ఆర్థిక భారం రెండింటినీ సమతుల్యం చేస్తూ ఈ ఛార్జీల పెంపును నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ ప్రయాణం
ప్రజా రవాణా వ్యవస్థను సాంకేతికతతో అనుసంధానించడంలో భాగమైన ఈ కామన్ పాస్ ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
శనివారం ఉదయం 10 గంటలకు బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి మంత్రులందరూ ఈ కామన్ పాస్‌ను ఉపయోగించి మెట్రోలో ప్రయాణిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. నగరంలో ప్రజా రవాణాను బలోపేతం చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ తగ్గుతాయని, అందుకే ‘ఫస్ట్ మైల్ – లాస్ట్ మైల్’ కనెక్టివిటీపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రవాణా శాఖ మంత్రి స్పష్టం చేశారు.
ఆర్టీసీ, మెట్రోలతోపాటు ఆటో రంగాన్ని కూడా సమన్వయం చేసి భవిష్యత్తులో అన్ని రవాణా సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువస్తామని మంత్రి పొన్నం తెలిపారు.
12 ఏళ్ల తర్వాత సవరించిన ఆటో ఛార్జీల వివరాలు
ఆటో కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వం విడుదల చేసిన నూతన ఆటో ఛార్జీల టారిఫ్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పాత కనీస ఛార్జీ ₹20 నుంచి ₹30 కి పెంచారు. ప్రతి అదనపు కిలోమీటర్‌కు పాత ఛార్జీ ₹11 నుంచి ₹14కి సవరించారు. నిమిషానికి 50 పైసల నుంచి 75 పైసలకు పెంచారు. అర్హత ఉన్న ప్యాకేజీకి 25 పైసల నుంచి
50 పైసలకు సవరణ; గరిష్ఠ లగేజీ పరిమితి 100 కిలోలుగానే కొనసాగింపు
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రయాణాలకు సాధారణ ఛార్జీ కంటే 1.5 రెట్లు ఛార్జీ యథాతథంగా వర్తిస్తుంది. ఆటో మీటర్ల రీసెట్టింగ్‌కు ఆటో డ్రైవర్లకు 3 నెలల గడువు ఇచ్చారు. అప్పటివరకు ఆటోల్లో పాత, కొత్త ఛార్జీల వివరాలతో కూడిన టారిఫ్ కార్డులను ప్రదర్శించడం తప్పనిసరి చేశారు.
ఇదిలా ఉండగా, ఆర్టీసీ పక్షాన ఈవీ (EV) ఆటోలను కొనుగోలు చేస్తారనే ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. అది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని ఆటో సంఘాలకు స్పష్టం చేసింది. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ‘ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు’ ఏర్పాటు ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్ అభివృద్ధికి ₹52,000 కోట్ల పనులు: భట్టి విక్రమార్క
హైదరాబాద్ మహా నగరాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ ‘మోస్ట్ లివబుల్ సిటీ’గా తీర్చిదిద్దేందుకు రూ.52,000 కోట్లతో వివిధ మౌలిక వసతుల పనులు జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
రూ.38,000 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రెండో విడత పనులు చేపడుతున్నట్లు చెప్పారు. 366 కిలోమీటర్ల మేర రూ. 30,627 కోట్లతో ప్రాంతీయ రింగ్ రోడ్డును అందుబాటులోకి తెస్తున్నామన్నారు.30,000 ఎకరాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ అభివృద్ధి, మూసి నది పునర్నిర్మాణం, 21 రేడియల్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. నగరంలో భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను నడపడం, ఆటోలకు రెట్రో ఫిట్‌మెంట్ అందించడం, నూతన హెచ్‌ఐఎల్‌టీ పాలసీని తీసుకురావడం ప్రభుత్వ ప్రాధాన్యతలని వెల్లడించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ఆర్టీసీపై పెరిగిన బాధ్యతలను సిబ్బంది సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని మంత్రి పొన్నం అభినందించారు. నూతన సమగ్ర రవాణా విధానాలు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కోట్ల మంది ప్రయాణికులకు సురక్షితమైన, చవకైన ప్రయాణాన్ని అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.