మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ విస్తరణ; ‘వెట్రి పయనం’ పథకాన్ని ప్రారంభించిన తమిళనాడు సీఎం జోసప్ విజయ్

tamil nadu cm vijay

తమిళనాడు ప్రభుత్వం మహిళా సాధికారత,సులభతర రవాణా సౌకర్యమే లక్ష్యంగా చేపట్టిన ఉచిత బస్సు ప్రయాణ విస్తరణ పథకం ‘వెట్రి పయనం’ అక్టోబర్ 2, 2026 శుక్రవారం (మహాత్మా గాంధీ 157వ జయంతి) నాటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. చెన్నైలోని ఆసియాలోనే అతిపెద్ద కోయంబేడు బస్సు టెర్మినల్ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి జోసప్ విజయ్, ఈ నూతన సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు.

అనంతరం, కోయంబేడు నుంచి కంచీపురం వెళ్లే ప్రభుత్వ బస్సు ఎక్కి ప్రయాణించిన ముఖ్యమంత్రి విజయ్, అందులోని మహిళా ప్రయాణికులకు స్వయంగా ఉచిత బస్సు టిక్కెట్లను అందజేసి వారి పయనాన్ని ప్రారంభించారు. సాధారణ పట్టణ బస్సులకే పరిమితమైన పాత విధానాన్ని విస్తరిస్తూ, ఇకపై డీలక్స్, ఎక్స్‌ప్రెస్, లో-ఫ్లోర్, జిల్లాల మధ్య నడిచే సబర్బన్ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును ఈ పథకం కల్పిస్తోంది.

ఏయే బస్సుల్లో ఉచిత ప్రయాణం? పూర్తి వివరాలు ఇవే!

ప్రభుత్వ రవాణా సంస్థ నిబంధనల ప్రకారం ‘వెట్రి పయనం’ పథకం కింద అందుబాటులోకి వచ్చిన సేవల వివరాలు. నగరాలు, పట్టణాల్లో నడిచే సాధారణ బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్, ఎల్.ఎస్.ఎస్, డీలక్స్, లో-ఫ్లోర్ ప్రభుత్వ బస్సులు, జిల్లాల మధ్య నడిచే సబర్బన్ సాధారణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుంది.

కొండ ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల పరిధి దాటి నడిచే సాధారణ ప్రభుత్వ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకానికి ఎలాంటి ఆదాయ పరిమితి లేదు. రోజువారీ ప్రయాణాల సంఖ్యపై కూడా ఎలాంటి ఆంక్షలు లేవు. మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లు కూడా ఈ ఉచిత సేవలను వినియోగించుకోవచ్చు.

నగరాల్లో నడిచే ఎయిర్ కండిషన్డ్ బస్సులు, రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా నడిపే సుదీర్ఘ ప్రాంతీయ లగ్జరీ స్లీపర్ బస్సులకు ఈ ఉచిత పయనం వర్తించదు.

చెన్నై నుంచి కన్యాకుమారి వరకు బస్సులు మారి ఉచిత ప్రయాణం!

రవాణా శాఖ లెక్కల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,692 ప్రభుత్వ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రోజువారీగా ఏకంగా 84.32 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని ప్రభుత్వం అంచనా వేసింది.

సాధారణంగా తమిళనాడులో ఎక్స్‌ప్రెస్ బస్సులు 30 నుంచి 100 కిలోమీటర్లు, ఎల్.ఎస్.ఎస్ బస్సులు 30 నుంచి 40 కిలోమీటర్లు, డీలక్స్ బస్సులు 30 నుంచి 50 కిలోమీటర్ల మేర నడుస్తుంటాయి. ఈ విధానాన్ని బట్టి, ఒక మహిళ చెన్నైలో బయలుదేరి వరుసగా బస్సులు మారుతూ.. చెంగల్పట్టు, తిండివనం, విల్లుపురం, తిరుచ్చి, దిండిగల్, మదురై, విరుధునగర్, కోవిల్‌పట్టి, తిరునెల్వేలి, నాగర్‌కోయిల్ మీదుగా కన్యాకుమారి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశాన్ని ఈ ‘వెట్రి పయనం’ కల్పిస్తోంది.

ప్రతిపక్షాల విమర్శలు & రవాణా శాఖ హెచ్చరికలు

ఒకవైపు ప్రభుత్వం ఈ పథకాన్ని వేడుకగా ప్రారంభించగా, మరోవైపు ప్రతిపక్ష డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తారపురం, మధురాంతకం ప్రచార సభల్లో మాట్లాడిన స్టాలిన్,”సోషల్ మీడియాలో రీల్స్ చూస్తే ప్రజల కడుపు నిండుతుందా?” అని ప్రశ్నిస్తూ, రాష్ట్రంలో ధరల పెరుగుదల, శాంతిభద్రతల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇదిలా ఉండగా, పండుగల వేళ ప్రైవేట్ బస్సుల దోపిడీపై రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్తీబన్ స్పందించారు. ప్రైవేట్ బస్సు యజమానులు ప్రయాణికుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అదనపు చార్జీలు వసూలు చేస్తే వారి రవాణా లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం