ఆసియా క్రీడలు 2026: సెకండ్ హ్యాండ్ విల్లుతో ప్రపంచ విజేతపై నెగ్గిన కుమ్‌కుమ్ మోహోద్ !

Kumkum mohod

జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత ఆర్చరీ రంగానికి మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల కుమ్‌‌కుమ్ మోహోద్ అద్భుతమైన ఘనతను అందించింది. శనివారం జరిగిన మహిళల ఇండివిజువల్ రీకర్వ్ ఆర్చరీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన మాజీ వరల్డ్ యూత్ ఛాంపియన్ ఓ యెజిన్‌తో తలపడిన కుమ్‌కుమ్, హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో 6-5 తేడాతో షూట్-ఆఫ్‌లో సంచలన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

ఈ విజయంతో ఆసియా క్రీడల చరిత్రలోనే రీకర్వ్ ఆర్చరీ విభాగంలో ఇండివిజువల్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ ఆర్చర్‌గా కుమ్‌కుమ్ చరిత్ర సృష్టించడమే కాకుండా, రాబోయే ఒలింపిక్స్‌కు అర్హత (కోటా) సాధించింది. పేదరికం, ఆర్థిక ఇబ్బందుల నడుమ ఐదేళ్ల పాటు సెకండ్ హ్యాండ్ విల్లుతోనే శిక్షణ పొంది ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.

డ్రామాగా సాగిన ఫైనల్ పోరు: షూట్-ఆఫ్‌లో ’10’ పాయింట్లతో స్వర్ణం

ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠభరితంగా సాగింది. తొలి సెట్లలో కుమ్‌కుమ్ 1-3 తేడాతో వెనుకబడినప్పటికీ, వెంటనే పుంజుకుని 3-3తో సమం చేసింది. ఆ తర్వాత కొరియన్ క్రీడాకారిణి ఓ యెజిన్ ఆధిక్యంలోకి వెళ్లి 5-3తో ముందుకు సాగగా, తీవ్ర ఒత్తిడిలోనూ కుమ్‌కుమ్ ఏకాగ్రత కోల్పోకుండా తదుపరి సెట్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను 5-5తో సమం చేసింది.

విజేతను నిర్ణయించే ఆఖరి ‘షూట్-ఆఫ్’ రౌండ్‌లో కొరియా ఆర్చర్ ఓ యెజిన్ 8 పాయింట్లు మాత్రమే సాధించగా, కుమ్‌‌కుమ్ ఏకంగా 10 పాయింట్ల లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఈ మ్యాచ్ పునరాగమనంలో కుమ్‌కుమ్ వరుసగా 6 పాయింట్ల ’10’లను సాధించగా, మొత్తం మ్యాచ్‌లో 11 సార్లు ’10’ పాయింట్లను సాధించడం విశేషం.

దీనికి ముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ కాంగ్ చే-యంగ్ (దక్షిణ కొరియా)ను ఓడించిన కుమ్‌కుమ్, సెమీ ఫైనల్లో చైనాకు చెందిన జూ జింగ్యీని చిత్తు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది.

స్వీట్ బాక్స్ తయారీదారుని కుమార్తె.. ఐదేళ్ల సెకండ్ హ్యాండ్ విల్లు ప్రయాణం

మహారాష్ట్రలోని అమరావతికి చెందిన కుమ్‌కుమ్ తండ్రి అనిల్ మనోహర్ మోహోద్ చిన్నపాటి స్వీట్ బాక్సుల తయారీ వ్యాపారం నడుపుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కుమ్‌కుమ్ గత ఐదేళ్ల కాలంలో అధిక భాగం సెకండ్ హ్యాండ్ విల్లు తోనే శిక్షణ పొందిందని ఆమె తండ్రి అనిల్ తెలిపారు. టోర్నమెంట్ల కోసం రైలు స్లీపర్ క్లాస్, బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ కుమ్‌కుమ్ ఎన్నడూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

“శనివారం ఉదయం టీవీలో తన కుమార్తె స్వర్ణం గెలవడం చూసి మా కళ్ల వెంట ఆనంద భాష్పాలు వచ్చాయి. కుమ్‌కుమ్ అతిపెద్ద బలం ఆమె మానసిక దార్ఢ్యం. టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకం గెలిచినప్పుడు తన మెడలో పతకంతో ఉన్న ఫోటోను పంపింది. ఇప్పుడు ఇండివిజువల్ స్వర్ణంతో దేశ కీర్తిని నిలబెట్టింది” అని అనిల్ మోహోద్ ఆనందం వ్యక్తం చేశారు.

కృష్ణాష్టమి సంకల్పం & ఒలింపిక్స్ కల

కుమ్‌కుమ్ మోహోద్ తన విజయంపై బలమైన నమ్మకాన్ని ముందుగానే కలిగి ఉంది. అమరావతిలో ప్రతి సంవత్సరం జరిగే కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనే కుమ్‌కుమ్, గత ఏడాది సంకల్పం చేసుకున్నట్లు తెలిపింది. “వచ్చే కృష్ణాష్టమి నాటికి నేను అమరావతిలో ఉండకుండా, ఆసియా క్రీడల భారత శిక్షణ క్యాంప్‌‌లో ఉంటానని బలంగా అనుకున్నాను. నా సంకల్పం నెరవేరింది” అని ఆమె పేర్కొంది.

ఆమె వాట్సాప్ డిస్‌ప్లే ప్రొఫైల్‌లో కూడా ఒక చేతి రేఖాచిత్రం ఉంది. దానికింద ‘నా లక్ష్యం ఒలింపిక్స్, నా కల కూడా అదే.. ఏదో ఒక రోజు ఈ కలను నెరవేర్చుకుంటాను’ అనే క్యాప్షన్ రాసి ఉంది. ఆసియా క్రీడల విజయం, ఒలింపిక్ కోటా సాధించడంతో ఆమె ఒలింపిక్ కల వైపు అడుగులు పడ్డాయి.

సాంకేతిక శిక్షణ, ‘ది పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్’ పుస్తకాల పాఠాలు

అమరావతిలోని రాధే ఆర్చరీ అకాడమీలో కోచ్ ప్రఫుల్ డాంగే వద్ద కుమ్‌కుమ్ ప్రాథమిక శిక్షణ ప్రారంభించింది. మొదట్లో ఇండియన్ రౌండ్‌లో నాలుగేళ్ల పాటు కర్ర బాణాలతో శిక్షణ పొందిన కుమ్‌కుమ్, ఆ తర్వాత రీకర్వ్ విల్లుకు మారడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చిందని చెప్పింది.

కోచ్ ప్రఫుల్ డాంగే మాట్లాడుతూ.. కుమ్‌కుమ్ భుజాల బలాన్ని పెంపొందించడానికి మొదట్లో తక్కువ బరువు కలిగిన విల్లుతో శిక్షణ ఇచ్చామని, మానసిక ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రత్యేక విజువలైజేషన్ పద్ధతులు పాటించేదని తెలిపారు. కుమ్‌కుమ్ క్రమం తప్పకుండా ‘ది పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్’మరాఠీ పుస్తకం ‘విచార్ నియమ్’ చదువుతుందని ఆయన వెల్లడించారు.

ఫైనల్‌కు ముందు రోజు శుక్రవారం మహిళల టీమ్ విభాగంలో స్వర్ణం సాధించిన తర్వాత, తన కోచ్‌కి మరాఠీలో “పోడియం గాజ్జవనారా” (నేను పోడియంపై అద్భుతంగా ప్రదర్శన చేస్తాను) అని మెసేజ్ చేసి, శనివారం నాటి మ్యాచ్‌లో ఆ మాటను నిజం చేసి చూపించిందని కోచ్ గుర్తుచేసుకున్నారు.

ఆసియా క్రీడల అర్హత & విజయ ప్రస్థానం

గత ఏడాది ఆసియా కప్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కుమ్‌కుమ్, ఈ ఏడాది మే నెలలో షాంఘైలో జరిగిన వరల్డ్ కప్ స్టేజ్-2లో దీపికా కుమారి, అంకితా భగత్‌లతో కలిసి చైనా జట్టును ఓడించి టీమ్ గోల్డ్ గెలుచుకుంది. ఆ తర్వాత సోనెపట్‌లో జరిగిన ఆసియా క్రీడల ట్రయల్స్‌లో క్వాలిఫికేషన్‌లో అగ్రస్థానంలో నిలిచి, నాలుగు సార్లు ఒలింపియన్ అయిన దీపికా కుమారిని వెనక్కి నెట్టి భారత ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కించుకుంది.

గత కొన్ని నెలలుగా తన భుజాల బలం పెంచుకోవడంపై, విల్లు-చేతి విడుదల విధానంపై ప్రత్యేక దృష్టి సారించానని, ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాననే నమ్మకం తనలో ఉందని కుమ్‌కుమ్ తెలిపింది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం