జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత గ్రీకో-రోమన్ రెజ్లింగ్ విభాగంలో హర్యానాకు చెందిన 23 ఏళ్ల నితేష్ శివాచ్ చారిత్రాత్మక రజత పతకాన్ని సాధించాడు. పురుషుల 97 కేజీల గ్రీకో-రోమన్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన యురి నకాజ్తో చేతిలో 4-0 తేడాతో ఓటమి పాలైనప్పటికీ, నితేష్ భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు.
1962 ఆసియా క్రీడల్లో గణపత్ అందాల్కర్ (97+ కేజీల స్వర్ణం), మాల్వా సింగ్ (52 కేజీల స్వర్ణం) తర్వాత ఆసియా క్రీడల్లో గ్రీకో-రోమన్ రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా నితేష్ శివాచ్ రికార్డు సృష్టించాడు. తీవ్రమైన గాయం, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి నితేష్ సాధించిన ఈ పతకం భారత రెజ్లింగ్ రంగానికి ప్రత్యేక గర్వకారణంగా నిలిచింది.
11 ఏళ్ల క్రితం తీవ్ర గాయం.. ఉదయం 4 గంటలకే పాలు అమ్మిన ప్రయాణం
పదకొండేళ్ల క్రితం (2015లో) నితేష్ తీవ్రమైన మోకాలి గాయానికి గురయ్యాడు. ఆపరేషన్ అనంతరం సుమారు 18 నెలలకు పైగా రెజ్లింగ్ మ్యాట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో నితేష్ కెరీర్ దాదాపు ముగిసిపోయిందనే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆయన తండ్రి ఆనంద్, బాబాయ్ నవీన్ తమ డైరీ వ్యాపారంలో నితేష్ సాయం కోరారు.
గోహానా సమీపంలోని జగ్సీ గ్రామంలో గేదెల పాలను సేకరించి, ప్రతిరోజూ తెల్లవారుజామున 4గంటలకే మోటార్ బైక్‌పై పానీపట్‌లోని తమ దుకాణానికి తీసుకెళ్లి అమ్మేవారని నితేష్ తండ్రి ఆనంద్ గుర్తు చేసుకున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత, తన కుటుంబ సభ్యులను రెజ్లింగ్‌లో మరో ఆరు నెలల సమయం ఇవ్వాలని నితేష్ కోరాడు. “మా కుటుంబం, నా పట్టుదలే నన్ను ఈ రోజు పతకం సాధించేలా చేశాయి” అని నితేష్ వ్యాఖ్యానించాడు.
కోచ్ ఓం ప్రకాష్ దాహియా సలహా.. 120 కేజీల డమ్మీతో కఠిన శిక్షణ
గోహానా సమీపంలోని స్థానిక అఖారాలో శిక్షణ పొందిన నితేష్‌ను, ఆ తర్వాత ఖార్‌ఖోడాలోని ప్రతాప్ స్పోర్ట్స్ స్కూల్‌లో మాజీ జాతీయ ఛాంపియన్, కోచ్ ఓం ప్రకాష్ దాహియా వద్ద చేర్పించారు. ఓం ప్రకాష్ దాహియా 1970 ఆసియా క్రీడల హెవీవెయిట్ ఛాంపియన్ చంద్గీ రామ్ శిష్యుడు.
ప్రారంభంలో సన్నగా ఉన్న నితేష్, ఫ్రీస్టైల్ ఆడేటప్పుడు ప్రత్యర్థులు ఆయన కాళ్లను పట్టుకునే వారని, అందుకే ఆయన బలమైన పైభాగం కండరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీకో-రోమన్ విభాగానికి మారమని సలహా ఇచ్చానని కోచ్ దాహియా తెలిపారు. గ్రీకో-రోమన్ కోసం నితేష్ 100 నుంచి 120 కేజీల బరువున్న డమ్మీలతో ప్రత్యేక శిక్షణ పొందేవాడని, ఇరాన్‌కు చెందిన లండన్ ఒలింపిక్స్ ఛాంపియన్ ఖాసేమ్ రెజాయీ వీడియోలను చూస్తూ మెళకువలు నేర్చుకున్నాడని కోచ్ వివరించారు.
ఆసియా క్రీడలలో నితేష్ విజయ ప్రస్థానం
నాగోయాలో జరిగిన ఆసియా క్రీడల టోర్నీలో నితేష్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తజికిస్థాన్‌కు చెందిన అమన్‌బెర్ది అగామమ్మేదోవ్‌పై 7-1 తేడాతో విజయం సాధించాడు. హాంజౌ ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, మంగోలియాకు చెందిన గాంఖుయాగ్ గాన్‌బాటార్‌పై 9-0 తేడాతో (టెక్నికల్ సుపీరియారిటీ) ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. ఫైనల్లో స్థానిక క్రీడాకారుడు, జపాన్‌కు చెందిన యురి నకాజ్తో చేతిలో 4-0తో ఓడిపోయి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
నెలకు రూ. 15,000 సంపాదన.. తండ్రి కల నెరవేర్చిన కుమారుడు
నితేష్ కుటుంబం పానీపట్‌లో నివాసం ఏర్పరచుకున్నప్పటికీ, ఆయన ఆహారం, శిక్షణ కోసం నెలకు వచ్చే రూ. 15,000 సంపాదనలో ఎక్కువ భాగాన్ని వెచ్చించేవారని తండ్రి ఆనంద్ తెలిపారు. “మేము పండుగలు, శుభకార్యాలకు కూడా వెళ్లకుండా నితేష్ శిక్షణకే ప్రాధాన్యత ఇచ్చాము. పాలు, నెయ్యి దాచి ఖార్‌ఖోడాకు, జాతీయ క్యాంపులకు తీసుకెళ్లేవాళ్లం. నేను ఊళ్లలోని దంగల్స్‌లో మాత్రమే కుస్తీపట్టి పెద్ద పతకాలు గెలవలేకపోయాను. కానీ నా కుమారుడు దేశానికి పతకం తెచ్చి నా కలను నెరవేర్చాడు” అని ఆనంద్ భావోద్వేగానికి లోనయ్యారు.
గతంలో 2019లో కాడెట్ ఆసియా రజతం, 2022లో యు-23 వరల్డ్స్ కాంస్యం, 2023, 2024 యు-23 ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య, రజతాలు సాధించిన నితేష్, ఈ ఏడాది బిష్కెక్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనూ రజతం సాధించాడు.