ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ (DSC) స్పోర్ట్స్ కోటా నియామకాల్లో ఎలాంటి అవకతవకలు లేదా అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట్ నామిశెట్టి స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాల ప్రక్రియపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, సాక్షి మీడియా దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తూ కూటమి ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్‌లపై ఆరోపణల తిరస్కరణ
గతంలో జూడో అసోసియేషన్‌లో అక్రమాలకు పాల్పడిన కారణంగా కొందరిని అసోసియేషన్ నుంచి బహిష్కరించామని వెంకట్ నామిశెట్టి వెల్లడించారు. అలా అవినీతి, అక్రమాలకు పాల్పడి బహిష్కరణకు గురైన వ్యక్తులంతా ఒకటై, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ అబద్ధపు నిందలు మోపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ చేస్తున్న అసత్య ఆరోపణలను తాను ఖండించినందుకు, కక్షపూరితంగా తనపైనా, తన కుమారుడిపైనా అసత్య కథనాలు ప్రసారం చేశారని దుయ్యబట్టారు.
అలాగే, ఈ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వ్యవహారంతో విశాఖపట్నం ఎంపీ భరత్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. సంబంధం లేని ఎంపీ భరత్ పేరును కూడా ఈ వివాదంలోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల నేపథ్యం వెల్లడి
డిబేట్లు, కథనాల్లో మాట్లాడిన వ్యక్తుల నేపథ్యాన్ని వెంకట్ నామిశెట్టి బహిర్గతం చేశారు. ఆనం కిషోర్ రెడ్డి, కె.ఎన్.బాబు, సి.కిరణ్ కుమార్, ఆర్.కె.పురుషోత్తంలతో పాటు ఏసీబీ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ జూడో అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ కైలాష్ యాదవ్‌లు క్రిమినల్ నేపథ్యం ఉన్న వారని ఆయన ఆరోపించారు. వీరిపై ఇప్పటికే వివిధ కోర్టుల్లో కేసులు, ఫేక్ సర్టిఫికెట్లకు సంబంధించిన తీవ్రమైన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు.
డీఎస్సీ నియామకాల ప్రక్రియ జరిగిన సమయంలో తాను కానీ, ఎంపీ భరత్ కానీ జూడో అసోసియేషన్‌లో లేరని వెంకట్ నామిశెట్టి స్పష్టం చేశారు.
హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ విచారణ, పరువు నష్టం దావా హెచ్చరిక
జూడో అసోసియేషన్‌లో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విజిలెన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించిందని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు జరిగే ఆ విజిలెన్స్ విచారణకు తాము పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు.
ప్రత్యర్థులు, విపక్షాలు మీడియా ముందుకు తెస్తున్న సర్టిఫికెట్లు, ఆధారాలు వందకు వంద శాతం నకిలీవని తాను నిరూపిస్తానని సవాల్ విసిరారు. తమపై, ప్రభుత్వంపై చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని వెంటనే విరమించుకోకపోతే, తప్పుడు కథనాలు ప్రసారం చేసిన వారిపై చట్టపరంగా క్రిమినల్ పరువు నష్టం దావా వేస్తామని వెంకట్ నామిశెట్టి తీవ్రంగా హెచ్చరించారు.