నేడు మన వంటింటి డబ్బాలో అతి చౌకగా లభించే ఒక కేజీ ఉప్పు వెల రూ. 20 మాత్రమే కావచ్చు. అయితే మానవ సంస్కృతి, చరిత్రలో ఒకానొక సమయంలో ఈ తెల్లటి ధాన్యం బంగారం తూకంతో సరిసమానంగా తూగింది. ఈ ఉప్పు కోసమే రాజ్యాలు ఏర్పడ్డాయి, రహదారులు నిర్మితమయ్యాయి, భారమైన పన్నులు విధించారు, తిరుగుబాట్లు చెలరేగాయి, వేల మంది తమ ప్రాణాలను సైతం అర్పించారు.
మానవుడు వేటగాడిగా ఉన్న కాలంలో జంతువుల మాంసం, రక్తం నుంచి శరీరానికి కావాల్సినంత ఉప్పు సహజంగానే లభించేది. కానీ మానవుడు వ్యవసాయం ప్రారంభించి ధాన్యాలు, కూరగాయలపై ఆధారపడటం మొదలుపెట్టినప్పుడు తీవ్రమైన సమస్య ఎదురైంది. మొక్కల ద్వారా లభించే ఆహారం శరీర ఉప్పు అవసరాలను తీర్చలేకపోవడమే దానికి కారణం. ఉప్పు లేకపోతే మానవ శరీరంలోని కండరాలు సరిగ్గా ముడుచుకోలేవు, నరాలలో సంకేతాల ప్రసారం నిలిచిపోతుంది. తీవ్ర లోపం ఏర్పడితే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అందువల్ల, మానవుడు పొలం దున్నడం ప్రారంభించిన రోజే ఉప్పు కేవలం రుచికరమైన పదార్థంగా కాకుండా, ప్రాణరక్షణకు అత్యంత అత్యవసరమైన మూలకముగా మారింది.
పురాతన నాగరికతలు, తొలి ఉప్పు ఉత్పత్తి కేంద్రాలు
ఈ అత్యవసర వస్తువు లభ్యత ఆధారంగానే ప్రాచీన సమాజాల పురోగతి నిర్ణయమైంది. సముద్రపు నీరు ఇంకిపోవడం వల్ల ఏర్పడే తెల్లటి పొరలు, భూమి అంతర్భాగం నుంచి వచ్చే ఉప్పు నీటి బుగ్గలు, పర్వతాలలోని ఉప్పు రాళ్ల రూపంలో ఉప్పు సహజంగా లభించేది. ప్రస్తుత బల్గేరియా ప్రాంతంలోని ‘సోల్నిత్సాతా’ అనే ప్రదేశంలో సుమారు 6,000 సంవత్సరాల నాటి పురాతన ఆధారాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అక్కడ ప్రజలు మట్టి పాత్రలలో ఉప్పు నీటిని మరిగించి ఉప్పును తయారుచేసేవారు. నాణేలు లేదా డబ్బు రూపంలో కరెన్సీ లేని ఆ కాలంలో, ఈ ఉప్పును రాగి, పనిముట్లు, ఇతర నిత్యావసర వస్తువుల మార్పిడికి ఉపయోగించేవారు. ఇది ఐరోపాలోనే ఉప్పు ఉత్పత్తిపై ఆధారపడిన అతి పురాతన స్థావరంగా నిలిచింది.
అదే కాలంలో చైనాలోని సిచువాన్ ప్రాంతంలో ప్రజలు ఉప్పు నీటి సరస్సుల నుంచి ఉప్పును వెలికితీసే వినూత్న సాంకేతికతను అభివృద్ధితోపాటు వెదురు గొట్టాల సహాయంతో వందల మీటర్ల లోతు వరకు ఉప్పు నీటి బావులను తవ్వారు. ఈ తవ్వకాల సమయంలో భూమి లోపల నుంచి లభించిన మండే వాయువును ఉప్పు నీటిని మరిగించడానికి ఇంధనంగా ఉపయోగించారు. ఇది మానవ చరిత్రలోనే సహజ వాయువు తొలి వినియోగంగా నమోదైంది.
మరోవైపు ఈజిప్టులోని నైలు నది తీరంలో సేకరించిన ఉప్పు ద్వారా మాంసం కుళ్ళిపోకుండా భద్రపరిచే పద్ధతిని కనుగొన్నారు. ఈ సాంకేతికతే ప్రాచీన ఈజిప్షియన్లు తమ రాజుల భౌతిక కాయాలను ‘మమ్మీలు’గా వేలాది సంవత్సరాల పాటు సురక్షితంగా ఉంచడానికి దోహదపడింది. ఉప్పు ద్వారా ఆహారాన్ని నెలల తరబడి నిల్వ చేసుకునే వెసులుబాటు లభించడంతో, మానవ సమాజాలు సుదీర్ఘ శీతాకాలాన్ని తట్టుకోవడం, సుదూర ప్రయాణాలు చేయడం, పెద్ద సైన్యాలను నిర్వహించడం సాధ్యపడింది.
రోమన్ ‘శాలరీ’ నుంచి వెనిస్ వైభవం వరకు
ఆస్ట్రియాలోని హాల్‌స్టాట్ ప్రాంతంలో సుమారు 3,500 సంవత్సరాల క్రితం పర్వతాలను తొలచి ఘనరూప ఉప్పు రాళ్లను తవ్వితీశారు. దీనివల్ల ఆ ప్రాంతం తీవ్ర సమృద్ధిని సాధించి ఐరోపా ఇనుప యుగంలో ‘హాల్‌స్టాట్ సంస్కృతి’గా గుర్తింపు పొందింది.
రోమన్ సామ్రాజ్యంలో ఉప్పు ప్రాముఖ్యత మరింత పెరిగింది. రోమన్ సైనికులకు వారి వేతనంలో కొంత భాగాన్ని ఉప్పు కొనుగోలు చేయడానికి ప్రత్యేక భత్యంగా ఇచ్చేవారు. ఈ పద్ధతి నుంచే లాటిన్ భాషలోని ‘సెలరియం’ అనే పదం ఉద్భవించింది, అదే కాలక్రమేణా ఆంగ్లంలో నేటి ‘శాలరీ’ (Salary – జీతం)గా మారింది. రోమన్లు ఉప్పు రవాణా కోసం తీర ప్రాంతాల నుంచి రోమ్ నగరం వరకు ప్రత్యేకంగా ‘వయా సలారియా’ను నిర్మించారు.
మధ్యయుగంలో ఇటలీకి చెందిన వెనిస్ (Venice) నగరం ఉప్పు వ్యాపారం ద్వారానే పశ్చిమ ఐరోపాలో అత్యంత శక్తివంతమైన సముద్ర వ్యాపార కేంద్రంగా ఎదిగింది. సముద్ర తీరంలో భారీ ఉప్పు మడులను ఏర్పాటు చేసి, మధ్యధరా సముద్ర ప్రాంతమంతటా ఉప్పు సరఫరాపై ఆధిపత్యం సాధించింది. ఉప్పు విక్రయించి తిరిగివచ్చే నౌకల ద్వారా పట్టు, సుగంధ ద్రవ్యాలు వంటి ఖరీదైన వస్తువులను దిగుమతి చేసుకుని వెనిస్ అపార సంపదను సమకూర్చుకుంది.
సహారా ఎడారిలో ‘నిశ్శబ్ద వ్యాపారం’
ఆఫ్రికాలోని సహారా ఎడారి ప్రాంతంలో చోటుచేసుకున్న ఉప్పు వ్యాపారం చరిత్రలోనే అత్యంత విచిత్రమైనది. పశ్చిమ ఆఫ్రికాలో బంగారపు గనులు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఉప్పు కొరత తీవ్రంగా ఉండేది. అదే సమయంలో ఉత్తర సహారాలోని తఘాజా (Taghaza) వంటి ప్రాంతాల్లో ఉప్పు రాళ్ల గనులు విస్తారంగా ఉండేవి.
దీనివల్ల అక్కడ ‘నిశ్శబ్ద వ్యాపారం’ ప్రారంభమైంది. వ్యాపారులు ఉప్పు దిమ్మలను ఎడారి సరిహద్దుల్లో ఉంచి దూరంగా వెళ్లేవారు. స్థానిక ప్రజలు వచ్చి ఆ ఉప్పు బరువుకు సమానమైన బంగారాన్ని దాని పక్కన ఉంచి వెళ్లేవారు. ఇరుపక్షాల వ్యక్తులు ముఖాముఖి కలవకుండానే ఈ వ్యాపారం పూర్తయ్యేది. ఒకానొక సమయంలో ఉప్పును దాని బరువుకు సమానమైన బంగారం ధరకు విక్రయించారు. ఈ వ్యాపార వైభవంతోనే టింబక్టు నగరం ప్రపంచ ప్రసిద్ధ విజ్ఞాన, ఆర్థిక కేంద్రంగా వికసించింది.
భారత్‌లో కూడా ఉప్పు తయారీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. గుజరాత్ తీర ప్రాంతాలు, రాజస్థాన్‌లోని సాంబార్ సరస్సు వంటి ప్రదేశాల్లో శతాబ్దాలుగా సముద్రపు నీటిని చిన్న గుంటలలో నింపి, సూర్యరశ్మి ద్వారా ఆవిరి చేసి ఉప్పును తయారుచేసే ప్రాచీన పద్ధతి కొనసాగింది.
ఉప్పు పన్నులు, విప్లవాల రగిలిన జ్వాలలు
ఉప్పు ప్రజల మనుగడకు అత్యంత అవసరమైన వస్తువు కావడంతో, పాలకుల దృష్టి దీనిపై పన్నులు విధించడంపై పడింది. ఫ్రాన్స్‌లో శతాబ్దాల పాటు ‘గాబెల్’అనే కఠినమైన ఉప్పు పన్ను చట్టం అమలులో ఉండేది. దీని ప్రకారం ప్రతి కుటుంబం ప్రభుత్వం నిర్ణయించిన అధిక ధరలకు నిర్బంధంగా ఉప్పును కొనుగోలు చేయాల్సిందే. పేద రైతులు తమ ఆదాయంలో సగానికి పైగా ఉప్పు పన్నుకే వెచ్చించాల్సి వచ్చేది. దీనివల్ల ‘ఫౌసే-సోనియర్స్’ అని పిలవబడే ఉప్పు దొంగల రవాణా నెట్‌వర్క్ తయారైంది. ఈ పన్నుపై ప్రజల్లో రగిలిన తీవ్ర ఆగ్రహమే ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణాలలో ఒకటిగా మారింది.
భారత్‌లో 20వ శతాబ్దంలో బ్రిటీష్ పాలకులు ఉప్పు తయారీ, విక్రయాలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించారు. సముద్ర తీరంలో నివసించే భారతీయులు కూడా సొంతంగా ఉప్పు తయారుచేసుకోవడానికి వీలులేకుండా చట్టం చేశారు. ఈ అన్యాయమైన చట్టానికి నిరసనగా 1930లో మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్ తీరంలోని దండి గ్రామం వరకు 24 రోజుల పాటు సుమారు 400 కిలోమీటర్ల మేర ‘దండి మార్చ్’ నిర్వహించారు. ఏప్రిల్ 6న సముద్ర తీరంలో దోసిళ్లతో ఉప్పును ఎత్తి బ్రిటీష్ చట్టాన్ని ఉల్లంఘించారు. ఈ చిన్న ఘటన దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలను ఉద్యమంలోకి నడిపించి, భారత స్వాతంత్ర్య సంగ్రామానికి కొత్త మలుపు తిప్పింది.
భూగర్భ వింతలు-ఆధునిక పారిశ్రామిక వినియోగం
భూగర్భంలో ఉప్పు పొరలు ఏర్పడటం వెనుక కోట్ల సంవత్సరాల భౌగోళిక చరిత్ర ఉంది. పూర్వం సముద్రపు నీరు పెద్ద గుంటలలో నిలిచిపోయి, సూర్యరశ్మికి నీరు ఆవిరై మిగిలిన ఖనిజాలు కాలక్రమేణా ఘనరూప ఉప్పు రాళ్లుగా మారాయి. పోలాండ్‌లోని విలిచ్కా ఉప్పు గని దీనికి నిదర్శనం. అక్కడ శతాబ్దాల తవ్వకాల అనంతరం కార్మికులు భూగర్భంలో ఉప్పు రాళ్లను తొలిచి ప్రార్థనా మందిరాలు, విగ్రహాలను చెక్కారు, ఇది ప్రస్తుతం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
19వ, 20వ శతాబ్దాలలో పారిశ్రామిక విప్లవం, యంత్రాల రాకతో ఉప్పు ఉత్పత్తి అత్యంత చౌకగా మారింది. దీనితో ఒకప్పుడు బంగారం కంటే ఖరీదైన ఉప్పు, సామాన్యుడికి తక్కువ ధరకే లభించేలా మారింది.
నేడు మనం ఉపయోగిస్తున్న ఉప్పులో 90% భాగం ఆహారం కోసం కాకుండా పారిశ్రామిక రసాయనాల తయారీకే వినియోగిస్తున్నారు. క్లోరిన్, సోడియం, ప్లాస్టిక్, కాగితం, సబ్బు, గాజు, ఔషధాల తయారీతో పాటు శీతాకాలంలో రోడ్లపై మంచును కరిగించడానికి ఉప్పును ఉపయోగిస్తున్నారు.
మానవ నాగరికతలు మారాయి, కరెన్సీలు మారాయి, సామ్రాజ్యాలు కూలిపోయాయి. కానీ ప్రతి యుగంలోనూ, ప్రతి నాగరికతలోనూ ఉప్పు తన ప్రాధాన్యతను మౌనంగా చాటుకుంటూనే ఉంది. నేడు మన భోజన బల్లపై ఉన్న చిన్న ఉప్పు రేణువు వెనుక వేలాది సంవత్సరాల పోరాటాలు, విప్లవాలు, మానవ ప్రగతి దాగి ఉన్నాయి.