డబ్బు సమస్యలకు శాశ్వత చెక్: ‘మనీ బకెట్ సిస్టమ్’తో మీ ఆర్థిక భవిష్యత్తు సురక్షితం

money management

మహిళలు, యువ ఉద్యోగులు,సగటు మధ్యతరగతి కుటుంబాలలో నెల చివరి తేదీ రాగానే బ్యాంక్ బ్యాలెన్స్ చూసి నిరాశ చెందే పరిస్థితికి స్వస్తి పలికేలా సరికొత్త ‘మనీ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ అందుబాటులోకి వచ్చింది. ప్రతి నెలా ఎంత సంపాదిస్తున్నామనే దానికంటే, ఆ డబ్బును ఏ విధంగా వర్గీకరించి వినియోగిస్తున్నామనేది అత్యంత కీలకమని ఫైనాన్షియల్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అకస్మాత్తుగా ఎలాంటి ఖర్చు వచ్చినా అప్పులు చేయకుండా, క్రెడిట్ కార్డులపై ఆధారపడకుండా నిలబడేందుకు ఒక పక్కా వ్యూహం అవసరమని ఈ నమూనా నొక్కిచెబుతోంది.

సమాజంలో అత్యధికులు ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఒకేసారి సాధించవచ్చని భావిస్తారు; కానీ అది చిన్న చిన్న బఫర్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారానే సాధ్యమవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జీతం రాగానే డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టాలో ముందే ప్రణాళిక రచించుకోవడం, అందుబాటులో ఉన్న ఆదాయాన్ని నాలుగు వేర్వేరు “బకెట్లు” గా వర్గీకరించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణతోపాటు భవిష్యత్ ప్రశాంతతను పొందవచ్చని ఈ కథనం సవివరంగా అందిస్తోంది.

రాహుల్ వర్సెస్ అమన్: రెండు వేర్వేరు ఆర్థిక ప్రవర్తనలు

సమాజంలో ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన జీతం పొందుతున్నప్పటికీ వారి ఆర్థిక స్థితిగతులు ఎందుకు వేర్వేరుగా ఉంటాయో అర్థం చేసుకోవడానికి ‘రాహుల్- అమన్’ ఉదాహరణ స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది.

రాహుల్ నెలవారీ జీతం ₹60,000 ఒకే బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అదే ఖాతా నుంచి బిల్లులు, షాపింగ్, డిన్నర్లు, యూపీఐ చెల్లింపులు జరుగుతాయి. ప్రారంభంలో ₹60,000 బ్యాలెన్స్ చూడగానే డబ్బు ఉందనే ధీమాతో చిన్న చిన్న ఖర్చులు చేస్తాడు. ప్రతి చెల్లింపు చిన్నదిగానే కనిపించినా, నెల ఆఖరుకు ఖాతా ఖాళీ అయిపోతుంది.

అమన్ జీతం కూడా ₹60,000. కానీ అతను పూర్తి మొత్తాన్ని ఖర్చు చేయదగిన నిధిగా భావించడు. ప్రతి రూపాయికి ముందే ఒక బాధ్యతను కేటాయిస్తాడు. అవసరమైన బిల్లులు, అత్యవసర నిధి, దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యక్తిగత సరదాల కోసం వేర్వేరు ఖాతాలు లేదా బకెట్లను ఉపయోగిస్తాడు.

రూపాయికి నిర్దిష్టమైన బాధ్యత కేటాయించకపోతే, అది ఖర్చైపోవడం సహజమని అమన్ పాటించే ‘మనీ బకెట్ పిరమిడ్’ నిరూపిస్తోంది.

నలుగురు భాగాల ‘మనీ బకెట్’ విభజన

ఆదాయం రాగానే దానిని నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించాలని ఈ సిస్టమ్ మార్గదర్శనం చేస్తోంది

సర్వైవల్ నిధి (Survival Money):

ఇంటి అద్దె, ఈఎంఐలు, కిరాణా, విద్యుత్ బిల్లు, రవాణా, పిల్లల స్కూల్ ఫీజు, మందులు, ఇన్సూరెన్స్ ప్రీమియం వంటి నిత్యావసరాలు దీని పరిధిలోకి వస్తాయి. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, ఫుడ్ డెలివరీలు లేదా వీకెండ్ షాపింగ్‌లు ఇందులో చేరవు.

ఫ్యూచర్ నిధి (Future Money):

చాలామంది నెల ఆఖరున మిగిలిన డబ్బును పొదుపు చేయాలని చూస్తారు; కానీ నెల చివరికి ఏమీ మిగలదు. అందుకే జీతం రాగానే మొదటి ఆర్థిక కట్టుబాటుగా నిధులను ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లేదా లాంగ్-టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లలోకి మళ్లించాలి.

అత్యవసర నిధి (Emergency Money):

అకస్మాత్తుగా కారు రిపేరు, ఉద్యోగంలో అంతరాయం లేదా వైద్య అత్యవసరాలు వచ్చినప్పుడు అధిక వడ్డీ రుణాల బారిన పడకుండా ఈ నిధి కాపాడుతుంది. ఈ నిధి ఉద్దేశం గరిష్ట లాభాలు సంపాదించడం కాదు, కష్టకాలంలో తప్పుడు ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని రక్షించడమే. క్రమంగా 3 నుంచి 6 నెలల నిత్యం ఖర్చులకు సరిపడా బఫర్ సిద్ధం చేసుకోవాలి.

గిల్ట్-ఫ్రీ స్పెండింగ్ (Guilt-Free Spending):

ప్రతి రూపాయి పొదుపుకే కాకుండా, మనస్ఫూర్తిగా ఖర్చు చేయడానికి కూడా కొంత నిధిని కేటాయించాలి. బకెట్‌లో కేటాయించిన పరిమితి పూర్తయితే ఆ నెలతో స్పెండింగ్ ఆపేయాలి; అత్యవసర లేదా పెట్టుబడి ఖాతాల నుంచి డబ్బును ఉపసంహరించకూడదు.

₹50,000 రాబడిపై ఆచరణాత్మక బడ్జెట్ కేటాయింపుల పట్టిక

ఒక వ్యక్తి నెలవారీ రాబడి ₹50,000 ఉన్నప్పుడు బకెట్ సిస్టమ్‌ను ఏ విధంగా అమలు చేయవచ్చో చూద్దాం.

  • సర్వైవల్ నిధి (Survival): ఇల్లు, కిరాణా, బిల్లులు, రవాణా, ప్రాథమిక అవసరాలకు 56%
  • దీర్ఘకాలిక పెట్టుబడి (Investment): భవిష్యత్ సంపద సృష్టి, ఎస్ఐపీ (SIP) నిధులకు 14%
  • అత్యవసర నిధి (Emergency Fund): ముందస్తు రక్షణ, లిక్విడ్ బఫర్ 10% నిధులు
  • భవిష్యత్ లక్ష్యాలు (Future Goals): పిల్లల చదువులు, సొంత ఇల్లు మొదలైనవవాటి కోసం 8%
  • వ్యక్తిగత ఖర్చులు (Guilt-Free): సినిమాలు, షాపింగ్, వినోదం, సరదాలు 12% ఖర్చుపెట్టాలి.

లైఫ్‌స్టైల్ ద్రవ్యోల్బణం, సింకింగ్ ఫండ్స్, ఆదాయ వృద్ధి

లైఫ్‌స్టైల్ ద్రవ్యోల్బణం (Lifestyle Inflation): జీతం ₹50,000 నుంచి ₹60,000కి పెరిగినప్పుడు, పెరిగిన ₹10,000 మొత్తాన్ని పూర్తిగా విలాసాలకు ఖర్చు చేయకూడదు. అందులో కనీసం ₹5,000 పెట్టుబడులకు, ₹2,000 భవిష్యత్ లక్ష్యాలకు, ₹3,000 జీవనశైలి మెరుగుదలకు కేటాయించడం శ్రేయస్కరం.

సింకింగ్ ఫండ్స్ (Sinking Funds): వార్షిక కార్ ఇన్సూరెన్స్ లేదా పాఠశాల ప్రవేశ ఫీజులు అకస్మాత్తుగా వచ్చే అత్యవసరాలు కావు; వాటి తేదీలు ముందే తెలుసు. ₹12,000 వార్షిక ప్రీమియం కోసం ప్రతి నెలా ₹1,000 చొప్పున కేటాయించడాన్ని ‘సింకింగ్ ఫండ్’ అంటారు.

ఆదాయ వృద్ధి సూత్రం (Income Growth): ప్రాథమిక ఖర్చులే ఆదాయాన్ని మించిపోతున్నప్పుడు , కేవలం పొదుపుతో సమస్య తీరదు. కొత్త నైపుణ్యాలు (Skills), ఫ్రీలాన్సింగ్ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే నిజమైన పరిష్కారం.

3 నెలల బ్యాంక్ ఆడిట్: మీ ఆర్థిక స్థిరత్వాన్ని పరీక్షించుకోండి

వచ్చే నెల జీతం కోసం వేచి చూడకుండా, గత 3 నెలల బ్యాంక్ లేదా యూపీఐ (UPI) స్టేట్‌మెంట్లను పరిశీలించి ఈ క్రింది 4 అంశాలను లెక్కించాలని నిపుణులు సూచిస్తున్నారు:

  • 1. మీ అత్యవసర ప్రైమరీ ఖర్చులు (Survival Expenses) ఎంత?
  • 2. అనవసర కోరికలపై (Random Wants) ఎంత డబ్బు వెళుతోంది?
  • 3. భవిష్యత్తు కోసం నికరంగా ఎంత పొదుపు అవుతోంది?
  • 4. రేపే మీ ఆదాయం ఆగిపోతే, అప్పులు చేయకుండా ప్రశాంతంగా ఎన్ని నెలలు జీవించగలరు?

ఆర్థిక క్రమశిక్షణకు బలమైన మనోబలం కంటే, ఆటోమేటెడ్ మరియు పక్కా వ్యవస్థ (System) ఉండటమే ప్రధానమని ఈ మోడల్ నిరూపిస్తోంది. ఆదాయంలో ప్రతి రూపాయికి ముందే ఒక బాధ్యతను కేటాయించడం ద్వారా నిరంతర ఆర్థిక ప్రశాంతతను సాధించవచ్చు.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం